ప్రజాప్రతినిధుల వేతనాల పెంపుపై గతంలో ఢిల్లీ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున్న విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఓ జీవోని రూపుదిద్దుకుని ఎంపీల కంటే ఎక్కువగా జీతాలు పెంచేసుకున్నారంటూ సామాన్య ప్రజానీకం సైతం సోషల్ మీడియాలో కేజ్రీవాల్ ప్రభుత్వం చేసిన పనిపై దుమ్మెత్తి పోశాయి. ఇక ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అదే తప్పును చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి.
త్వరలో రానున్న జీవోతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వేతనాలు భారీగా పెరగనున్నాయి. ప్రస్తుతం నెలకు రూ.1.25 లక్షల వేతనం తీసుకుంటున్న వీరు అసెంబ్లీ ఎమినిటీస్ కమిటీ సిఫారసు చేసిన మేరకు వేతనాల పెంపునకు ప్రభుత్వం సరేనంటే ఇకపై వారు నెలకు రూ.3.5 లక్షల వేతనం తీసుకుంటారు. ఈ మేరకు నిన్న అసెంబ్లీ మీటింగ్ హాలులో స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి అధ్యక్షతన ఎమెనిటీస్ కమిటీ భేటీ అయ్యింది. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు ప్రతిపాదించిన మేరకు వేతనాల పెంపు, ఇతర సౌకర్యాల కోసం చేసిన డిమాండ్లను కమిటీ యథాతథంగా అనుమతించింది. సభ్యుల డిమాండ్లనే తీర్మానాలుగా మార్చేసిన కమిటీ అనుమతి కోసం ప్రభుత్వానికి పంపింది.
కమిటీ సిఫారసు చేసిన విషయాలకు వస్తే సభ్యుల వేతనాలను రూ.3.5లక్షలకు పెంచాలి. వాహన రుణాలను ప్రస్తుతం ఉన్న రూ.15 లక్షల నుంచి ఒకేసారి రూ.40 లక్షలకు పెంచాలి. వైద్య ఖర్చుల పరిమితిని ఎత్తేసి.. అపరిమిత ఉచిత వైద్య సేవలను అందజేయాలి. ఎమ్మెల్యే పీఏ వేతనాన్ని రూ.6 వేల నుంచి రూ.25 వేలకు పెంచాలి. మాజీ సభ్యులకు ఇస్తున్న పెన్షన్ ను రూ.50 వేల నుంచి రూ.65 వేలకు పెంచాలి. మాజీ సభ్యులు మరణించినా, వారి భార్యలకు పూర్తి పెన్షన్ ను అందజేయాలి. ఈ సిఫారసులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే వెనువెంటనే సభ్యుల వేతనాలు ఒక్కసారిగా అమాంతంగా పెరగనున్నాయి. తొలినాళ్లలో జీవోపై అంత ఆసక్తి కనబరచని కేసీఆర్ ఇప్పుడు ఈ చర్యకు దిద్దటం వెనక ఆంతర్యం ఏంటో ఎవరికీ అంతుబట్టడం లేదు.