విభజన తర్వాత ఉమ్మడి రాష్ట్రాల మధ్య నలుగుతున్న ప్రధాన వ్యవహారాల్లో హైకోర్టు ఒకటి. పదేళ్ల ఉమ్మడి రాజధాని పై ఆంధ్రప్రదేశ్ నుంచి ఎలాంటి అభ్యంతరాలు రాకుండా గప్ చుప్ గా ఉన్నప్పటికీ, సమస్యంతా తెలంగాణ ప్రభుత్వం నుంచే. ఇక హైకోర్టు వ్యవహారంపై గత కొద్దిరోజులుగా పార్లమెంట్ ప్రాంగణంలో టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళన నిర్వహిస్తున్నారు. తాజాగా, టిఆర్‌ఎస్ లోక్‌సభాపక్ష నేత జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి హైకోర్టు విభజన చేసే వరకూ పార్లమెంట్‌లో ఆందోళన కొనసాగిస్తామని మరోమారు స్పష్టం చేశారు. విడిపోయి యేడాది అయినప్పటికీ ఇంకా హైకోర్టును విభజించలేదని, ఈ విషయంలో స్పష్టమైన హామీనివ్వాలని కేంద్రాన్ని ఆయన డిమాండ్ చేశారు. గత కొన్ని రోజులుగా లోక్‌సభలో నెలకొంటున్న ప్రతిష్టంభనను తొలగించేందుకు పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు సోమవారం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి టిఆర్‌ఎస్ లోక్‌సభాపక్ష నేత జితేందర్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత పార్లమెంట్ సమావేశాల్లో న్యాయశాఖ మంత్రి సదానందగౌడ ఇచ్చిన హామీకి కేంద్రం కట్టుబడి ఉండాలని డిమాండ్ చేశారు. నిర్దిష్టకాలపరిమితిలో హైకోర్టును విభజిస్తామని కేంద్రం స్పష్టమైన హామీనివ్వాలని, అప్పటి వరకూ పార్లమెంట్‌లో టిఆర్‌ఎస్ ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు. సస్పెన్షన్‌కు భయపడబోమని తేల్చి చెప్పారు. దీంతో సమస్య మరింత జఠిలం కాకముందే తేల్చేందుకు కేంద్రం ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ మేరకు న్యాయ శాఖతో చర్చలు మొదలు పెట్టిన సమాచారం.