తెలంగాణ రాష్ట్రంలో తమ పార్టీ వారిని మభ్యపెట్టి, ప్రలోభపెట్టి తెలంగాణ రాష్ట్రసమితి తమ పార్టీలోకి ఆకర్షిస్తోందని తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన 15 మంది ఎమ్మెల్యేలు రచ్చ చేశారు. ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తున్నారని గొంతు చించుకుని గవర్నర్ ఇంటి ఎదుట ధర్నా చేసి, అసెంబ్లీ పోడియంలోకి చొచ్చుకెళ్లి బైఠాయించి, సస్పెండయ్యారు. కానీ, ఇప్పుడు నాడు నానాయాగీ చేసిన అదే ఎమ్మెల్యేలు నేడు ఆ పార్టీలోకి దూకేందుకు క్యూ కడుతున్నారు. సైకిల్ దిగి కారు ఎక్కేందుకు ఉత్సుహకత చూపుతున్నారు. ముఖ్యంగా టీఆర్ఎస్ ను, అధినేత కేసీఆర్ ను చెప్పుకోలేని భాషలో తిట్టిన వారే ఈ జంప్ జిలానీలో భాగస్వాములవుతున్నారు. ఒకరి తరువాత ఒకరు గులాబీ కండువా కప్పుకుంటుండగా, గ్రేటర్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అధికార పక్షం సైతం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ సాగుతోంది.
తెలుగుదేశం పార్టీ తరఫున తెలంగాణలో 15 మంది ఎమ్మెల్యేలు విజయం సాధించగా, వారిలో ఇప్పటికే 9 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరిపోయారు. పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, తీగల కృష్ణారెడ్డి, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, మాధవరం కృష్ణారావు, సాయన్న తదితరులు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో మిగిలిన ఆరుగురన్నా ఐకమత్యంగా ఉంటున్నారా? అనుకుంటే, అదీ కనిపించడం లేదు. రేవంత్ రెడ్డి దారి ఒకటైతే, ఎర్రబెల్లిది మరో దారి. మిగిలిన వారిలో తన నియోజకవర్గంలో నీటి సమస్య తీరిస్తే టీఆర్ఎస్ లో చేరుతానని ప్రకాష్ గౌడ్ పలుమార్లు వెల్లడించారు. ఇక ఆర్. కృష్ణయ్య ప్రత్యేక పార్టీ నినాదం ఎత్తుకుంటున్నారు. మిగిలిన ఒకరిద్దరిదీ అర్థం కానీ పరిస్థితి. టీడీపీ నుంచి ఇంకా కొంతమంది తమ పార్టీలోకి రానున్నారని తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి స్వయంగా చెప్పటంతో మిగిలిన వారిలో ఒకరిద్దరూ చేరిన టీడీపీ ఖాళీ కావటం ఖాయం.