ప్రజల జ్నాపక శక్తి మీద రాజకీయ నాయకుల్లో కొంతమందికి అపారమైన నమ్మకంతో కూడిన విశ్వాసం. ప్రజలకు మతిమరుపని, క్షమాగుణం మెండు అని భ్రమ. మనకున్న ముఖ్యమంత్రుల్లో ఆరవ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి అఘటనాఘటన సమర్థునిగా పేరు. వైద్య శాస్త్రం చదివినా రాజకీయాలు ఔపోసన పట్టి ముప్ఫై ఏళ్ల వయస్సులోనే మంత్రి పదవి చేపట్టేడు. ప్రత్యేక తెలంగాణ కోసం తెలంగాణ ప్రజాసమితి స్థాపించి పద్నాలుగు ఎంపీ సీట్లలో పదకొండు స్థానాలు గెలిపించుకున్న ఉద్దండుడు. ఇందిరాగాంధీకి కూడా ఝలక్ ఇవ్వడానికి వెనుకంజ వేయని ధీశాలి, చతురుడు. అప్పటి రోజుల్లో పారగుర్తు మీద పోటీచేసిన నెగ్గి పారను పక్కకు పారేసి ఉత్తర ప్రదేశ్ గవర్నరుగా విజయం చేసేడని ప్రజలు రకరకాలుగా ఊహించుకోడానికి అస్కారమివ్వడం జరిగింది.
రాష్ట్రం విడిపోయింది. చెన్నారెడ్డి గారి ఆత్మ సంతోషించి ఉంటుంది. అప్పటికి ప్రస్తుత హోంమంత్రి నాయని నూనుగు ప్రాయంలో ఉండి ఉండొచ్చు. చెన్నారెడ్డి ఒక యోధుడు, తెలంగాణ ఉద్యమాన్ని ఆయన ఏమీ తాకట్టు పెట్టలేదు అని వ్యాఖ్యానించడం అందరి దృష్టీ ఆకర్షించింది.
ఇప్పుడే ఈ అవ్యాజ అనురాగం ఎందుకు వెల్లి విరిసినట్టు? దీనికి కూడా కార్య కారణ సంబంధంపై పలువురు సిద్ధాంతీకరిస్తున్నారు. పెద్దాయన కుమారుడు మర్రిశశిధర్ రెడ్డికి సనత్ నగర్ నియోజకవర్గంతో విడదీయని బంధం అందరికీ తెలుసు. టీఆర్ఎస్ తలుపులు బార్లా తెరిచినందున తలసాని ఏమీ తటపటాయించకుండా గుమ్మం దాటి కోటలో పాగా వేసినదీ అందరికీ తెల్సు. ఈ విషయంలోనే శశిధర్ రెడ్డి అసహనంగా ఉన్నాడని యావన్మందికీ తెల్సు. ఏమో నాన్నగారి వైపు నుంచి నరుక్కువద్దామని నాయని దూరాలోచన ఏమో ఎవరికి తెల్సు?