ఇలా చూడండి భారతీయుల్లారా... ఆరుపదులు దాటినా ఎవరూ ఛేదించలేని నిగూఢ రహస్యాన్ని విప్పి మీ ముందుంచుతాం. సుభాష్ చంద్రబోస్ అదృశ్యంపై అంతుచిక్కని మర్మాన్ని పటాపంచలు చేసి చూపిస్తాం-బస్తీమే సవాల్ అని నేతాజీకి సంబంధించిన జాతీయ సదస్సులో వెంకయ్య ప్రకటించారు. అంతటితో సరిపెట్టారు. ఎక్కడ బ్రతికి ఉన్నా తెచ్చి భరతమాతకు బహుకరిస్తాం అనలేదు. మానవజీవపరిమాణంతో, ఇప్పటికీ ఎంత వయసులో ఉంటాడో కూడా పట్టించుకోకుండా, ఎక్కడో ఉండే ఉంటాడు నేతాజీ అనే ప్రకటనలు గతంలో విని ఉన్నాం. ఢిల్లీలో నేతాజీకి స్మృతి చిహ్నం ఏర్పాటు చేసే ప్రతిపాదనను పరిశీలిస్తుందని చల్లని కబురు చెప్పేరు. దేశభక్తి, త్యాగనీరతి, ధైర్యసాహసాల్లో సుభాష్ బాబుకి ఎందులోనూ పోలికలేని కుహనా నాయకులకి ఢిల్లీ నడిబొడ్డున ఎకరాలకి ఎకరాలు స్మృతి వనాలు ఏర్పాటు చేయగా, ఈ అసమాన యోధుడి విషయంలో ఇంకా పరిశీలిస్తున్నారనడం సిగ్గుచేటు.
1897 జనవరిలో జన్మించి ఆగష్టు 1945 న బోసు అంతర్థానమయ్యాడు. అప్పటి నుంచి ఎన్నో ఊహాగానాలు. షానవాజ్ కమిటీ, ఖోస్లా కమిషన్ అభిప్రాయం ప్రకారం 1945 జరిగిన విమాన దుర్ఘటనలో ఆయన చనిపోయాడనే. నెహ్రూగారు 1964 లో దివంగతులైనప్పుడు సాధువు వేషంలో వచ్చి వెళ్లాడని, పశ్చిమ బెంగాల్ సాల్ మారి ఆశ్రమం తనదేనని, 1962 లో చైనా యుద్ధంలో పాల్గొన్నాడని ఇలా ఎన్నో రకాలు. ఇంతకీ ఆయన భౌతిక కాయం ప్రత్యక్షంగా ఎవరూ చూసిన దాఖలాలు లేదు. మనకి తెలియనంత మాత్రాన చరిత్ర మారదు. వెలుగులోకి రాకుండా కాంగ్రెసు ప్రభుత్వం చూసిన ఎన్నో డాక్యుమెంట్లున్నాయి. వెంకయ్యగారి ప్రభుత్వం వచ్చి సంవత్సరమైంది. నల్లధనం లాంటి విషయాల్లో తాత్సారం జరిగిందనే ఉద్దేశ్యంతో ‘ఉట్టికెగరలేదని...’ కామెంట్లు చేస్తున్నారు. ఇక నేతాజీ అదృశ్యరహస్యం ఛేదిస్తే వెంకయ్యకు జోహర్లే కదూ!