తెలంగాణలో మొన్నామధ్య జరిగిన వరంగల్ జిల్లా మొద్దుగుట్ట ఎన్ కౌంటర్ రేపిన కలకలం ఎంత తీవ్రస్థాయిదో తెలిసిందే. విభజన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణలో మావోయిస్టుల ప్రాభవ్యం పెరుగుతుందని కేంద్రం ముందే చెప్పింది. అయితే టీఆర్ఎస్ అధికారంలోకి దాదాపు ఏడాదిన్నరపాటు ఆ ఛాయలు కనిపించకపోవటంతో అంత సజావుగానే సాగుతుందని అనుకున్నారంతా. కానీ, వరంగల్ ఎన్ కౌంటర్ తో ఉలిక్కిపడింది తెలంగాణ గడ్డ. ఇద్దరు విద్యావంతులైన నేతలను అందునా ఓ ఆడకూతురిని పొట్టనబెట్టుకున్నారంటూ ప్రజాసంఘాలతోసహా వామపక్షాలు చేరి రోడ్డెక్కాయి. విద్యావేత్త అయిన చుక్కారామయ్య లాంటి వారు కూడా ఈ వయస్సులో రోడెక్కి పోరాడతాడన్నాడంటే ఈ అంశం ఎంత కదిలించిందో అర్థం చేసుకోవచ్చు.
అయితే ఎన్ని ఆరోపణలు, విమర్శలు వస్తున్నా ఒక్కరంటే ఒక్క నేత కూడా దీనిపై స్పందించకపోవటం దారుణం. స్వయానా హోంమంత్రి నాయిని లాంటి వారుకూడా ఎక్కడా ఈ అంశాన్ని లేవనెత్తకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తూ వస్తున్నారు. కానీ, ప్రతిపక్షాల డిమాండ్ ముందు ప్రభుత్వం తప్పని సరి తలవంచక తప్పలేదు. దీంతో కేసీఆర్ తనయ, ఎంపీ కవిత ఈ అంశాన్ని చల్లబరిచేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఓ కూతురిగా శృతి తల్లిదండ్రుల ఆవేదనను అర్థంచేసుకోగలను అంటూనే, మరోవైపు తండ్రిని వెనకేసుకొచ్చింది. దీనిపై సరైన టైంలో సీఎంయే స్పందిస్తారంటూ ముక్తాయింపుగా మీడియా ముందు చెప్పింది.
ఇక ఇఫ్పుడు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వంతు వచ్చింది. నిన్నటిదాకా విపక్షాలు, ప్రజా సంఘాలు చేస్తున్న ఆరోపణలపై కిమ్మనని ఆయన నేటి ఉదయం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో తాము అమలు చేస్తోంది నక్సల్స్ పాలననేనని ఆయన పేర్కొన్నారు. మావోయిస్టులు ఆకాంక్షిస్తున్న సామాజిక, ఆర్థిక సమానత్వం కోసం తీవ్రంగా యత్నిస్తున్నామని కేటీఆర్ చెప్పారు. ఇక తెలంగాణకు సాయం చేయడంలో కేంద్రం పక్షపాత వైఖరితో వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. ఇతర రాష్ట్రాలకు అందిస్తున్న తరహాలోనే తెలంగాణకు కూడా కేంద్రం ఆర్థిక సాయం చేయాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. ఎన్ కౌంటర్ జరిగిన పరిస్థితులపై మాట్లాడకుండా, వారికి వ్యతిరేక విధానాలేమీ అమలు చెయ్యటం లేదంటూ కాస్తలో కాస్తైన ఊరటనిచ్చేందుకు ప్రయత్నించాడు. కేసీఆర్ సైతం మాట్లాడేందుకు తటపటాయిస్తున్న టైంలో మావోయిస్టుల మాదిరిగానే తాము నెత్తురు పారని తెలంగాణను కోరుకుంటున్నామని టచ్ చేసే విధంగా మాట్లాడాడు మంత్రిగారు.