ఎప్పుడూ ఎవరో ఒకరు పోరుబాట పట్టాల్సిందే. తదుపరి ఉపాధ్యాయుల వంతు. తాము ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం తెలంగాణా ఉపాధ్యాయులు వచ్చేనెల 9న మహాధర్నా చేపట్టనున్నారు. విద్యారంగ సమస్యలు, ఉపాధ్యాయుల ఇబ్బందులు, పీఆర్సీ బకాయిలు, హెల్త్ కార్డులపై ఆందోళనకు సిద్ధమైన ప్రధాన ఉపాధ్యాయ సంఘం పీఆర్‌టీయూ-టీఎస్ వచ్చే నెల 9న మహాధర్నాకు పిలుపునిచ్చింది. తమ సమస్యలపై వెంటనే స్పందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. పీఆర్‌టీయూ-టీఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.వెంకట్‌రెడ్డి, సరోత్తంరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ మోహన్‌రెడ్డి తదితరులు సచివాలయంలో సీఎస్ రాజీవ్ శర్మను కలసి ధర్నా నోటీసు అందజేశారు. ప్రభుత్వం ముఖ్యంగా హేతుబద్ధీకరణ పేరిట పాఠశాలల మూసివేత యోచనను ఉపసంహరించుకోవాలి. ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలను చేపట్టాలి. రూ.398 వేతనంతో పనిచేసిన స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలి. ఉన్నత పాఠశాలల్లో పండిట్, పీఈటీ పోస్టులను వెంటనే అప్‌గ్రేడ్ చేయాలి. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి వంటి డిమాండ్లతో నోటీసు అందజేసారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ, వచ్చే నెల 9న హైదరాబాద్‌లో 20 వేల మంది ఉపాధ్యాయులతో మహాధర్నా చేపడతామని చెప్పారు. ఆలోగా ప్రభుత్వం స్పష్టమైన ఉత్తర్వులు ఇవ్వాలని, లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వారు స్పష్టం చేశారు.