ఈరోజున ప్రపంచంలో అనేక చోట్ల వివిధ రంగాల్లో మనతెలుగువారు తమ ప్రతిభా పాటవాన్ని ప్రదర్శించి ప్రపంచంలో విశిష్ట గుర్తింపు పొందారు. అటువంటి మనతెలుగు జాతి ఐక్యతను ప్రపంచానికిచాటుదాం మనందరిది ఒకటే జాతి. తేనెలోలుకు తెలుగు జాతి అంటూ భాష దినోత్సవ రోజున నేతలు చేసే హడావుడి అంతా ఇంతా కాదు. దేశ భాషలందు తెలుగు లెస్సా అని శ్రీకృష్ణదేవరాయలు, ఆయన కన్నా ముందే వినుకొండ వల్లభరాయుడు పేర్కొవటం మనకు తెలిసిన విషయమే అంటూ స్పీచ్ లు దంచుతూ భాషాభిమానాన్ని ప్రదర్శిస్తుంటారు. ఈ క్రమంలోనే తమిళనాడులో కూడా తెలుగు భాషా బోధన చెయ్యాలన్న డిమాండ్ ను నేతలు తెరపైకి తెస్తున్నారు.
దీనికి కారణం లేకపోలేదు... తమిళనాడు లో గత కొన్నేళ్లుగా కొన్ని స్కూళ్లో తెలుగు భాషను భోదిస్తున్నారు. ఏపీ ఏర్పడకముందు మద్రాస్ లో కలిసి ఉన్న కారణంగా తెలుగు వాళ్లు అక్కడ ఎక్కువగా స్థిరపడటంతో దానిని కంటిన్యూ చేస్తూ వస్తున్నారు. అయితే ఈ మధ్య తెలుగు బడులను మూసివేయాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. తక్షణమే 316 జీవోను రద్దు చేయాలంటూ నగరంలోని ఇందిరాపార్క దగ్గర తమిళనాడు తెలుగు యువత, తెలుగు విద్యార్థి పరిషత్, తమిళనాడు తెలుగు సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసనకు దిగారు. వీరి ఆందోళనలకు సీపీఐ నేత నారాయణ, ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సంఘీభావం ప్రకటించారు కూడా.
ఇక దీనిపై రాజకీయ నేతలు రంగంలోకి దిగారు. జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి తమిళనాడులో తెలుగు బోధనను కొనసాగించాలని కోరుతూ చట్ట సభల్లో తీర్మానం చేసేందుకు ప్రయత్నిస్తామని ఏపీ మండలి చైర్మన్ చక్రపాణి అన్నారు. అవసరమైతే ఈ విషయంపై గవర్నర్ రోశయ్య, సీఎం జయలలితతో మాట్లాడతానని స్పష్టం చేశారు. తెలుగు ప్రాచీన భాషలలో ఒకటని అందుకే తెలుగుకు అందరూ ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. అయినా పిచ్చి కాకపోతేను అమ్మ కరుణించినా... తంబీలు ఊరుకుంటారా?
ఇది బాగానే ఉంది. పక్కన ఉన్న పొరుగు తెలుగు రాష్ట్రం సిలబస్ లను తొలగించుకోవటం తెలుసుగానీ, సంబంధం లేని అరవ ప్రాంతంలో తెలుగు బోధనకై తెగ కృషి చెయ్యటమేంటని చెవులు కొరుకుంటున్నారు. మాతృభాష గురించి లెక్చర్లు దంచే లెక్చర్లు రెండు తెలుగు రాష్ట్రాలే అన్న సంగతి గుర్తుంచుకుని మెదలాలని చెబుతున్నారు. ముందు పక్కవాళ్లతో సాంగిత్యం కంటిన్యూ చేస్తే చాలా మంచిదని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు.