ఏ కార్యక్రమమైనా... అది ఎలాంటిదైనా చిన్నదైనా పెద్దదైనా సరే... దాన్నిభారీ ఎత్తున నిర్వహించడంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తరువాతే ఎవరైనా... అన్న మాట చలామణిలో ఉంది. అంటే అంత భారీ ఎత్తున నిర్వహిస్తారు చంద్రబాబు నాయుడు. కార్యక్రమాలు నిర్వహించినంత రేంజ్ లో పనులు జరగవన్న అపప్రద కూడా ఆయన మీద ఉంది. అయితే ఇప్పుడు భారీ ఎత్తున ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన చేపడతారని వార్తలు వినిపిస్తున్నాయి. విజయదశమి రోజున ముహూర్తంగా చేపట్టే ఈ శంకుస్థాపన కార్యక్రమానికి ఎవరూ ఆలోచించని వినూత్నంగా చంద్రబాబు ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు. ఒక రాష్ట్రం నిర్వహించే కార్యక్రమం ఏదైనా, మహా అయితే ప్రధాన మంత్రి, రాష్ట్రపతిని పలిపిస్తారు. కానీ ఈయన చాలా భిన్నంగా ఆలోచించి... రాజధాని శంకుస్థాపనకు ఆయన బలమైన రాజ్యాధినేతల్ని కూడా భాగసావమ్యం చేయాలని భావిస్తున్నారట. ప్రపంచ టెక్నాలజీలో తిరుగులేని అత్యంత సంపన్న దేశాల్లో ఒకటైన జపాన్ ప్రధాన మంత్రితో పాటు, రాజధాని నిర్మాణంలో కీలకమైన మాస్టర్ ప్లాన్ తయారు చేసిన సింగపూర్ దేశ ప్రధానిని అతిథులుగా ఆహ్వానించాలని భావిస్తున్నారట. వీరితో పాటు, దేశ ప్రధాని నరేంద్రమోడీ ఉండనే ఉంటారు. దేశ ప్రధానుల్ని ఒక రాష్ట్రంలో జరిగే కార్యక్రమానికి పిలిపించటం ఎలా ఉంటుందన్న ఆలోచనను మోడీ ముందు ఉంచితే, ఆయన మంచి ఐడియా అని బాబును పొగిడారని చెబుతున్నారు. వేరే దేశాధి నేతలు పాల్గొనే కార్యక్రమానికి సంబంధించిన వ్యవహారం కాబట్టి, ఆయా దేశాల అధినేతల సమయాన్ని ముందస్తుగా తీసుకోవటం, వారి నుంచి హామీ పొందటం కీలకం కానుంది. ఈ నేపథ్యంలో జూన్ నెలాఖరులో మూడు దేశాల పర్యటనలకు చంద్రబాబు సిద్ధం అవుతున్నారు. కొరియా, జపాన్, హాంకాంగ్ లలో పర్యటించనున్న చంద్రబాబు ఈ సందర్భంగా జపాన్ ప్రధాన మంత్రిని కలిసి శంకుస్థాపనకు ముఖ్య అతిథిగా హాజరు కావాలని కోరనున్నట్లు చెబుతున్నారు.