బహుళార్థక ప్రాజెక్టుగా అంతకంటే ఆంధ్రప్రదేశ్ వరప్రదాయనిగా నిర్మాణం కంటే ముందు నుంచే వార్తల్లోకి ఎక్కింది పోలవరం ప్రాజెక్టు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు కలిసి ఉన్న సమయంలో కన్నా విభజన తర్వాతే దీని ప్రాధాన్యం రెట్టింపయ్యింది. దీనికి కారణం పునర్వస్థీకరణ బిల్లు ప్రకారం కేంద్రం జాతీయ హోదా ప్రకటించడం. అంటే పోలవరం మొత్తం నిర్మాణంకు అయ్యే ఖర్చును కేంద్రమే భరించాలి. ఈ ప్రాజెక్టు గనుక పూర్తయితే నాలుగు జిల్లాలో ఏడు లక్షల ఎకరాలకు నీరు అందించటంతోపాటు పైప్ లైన్ల ద్వారా సీమకు కూడా కొంత వాటా నీరు కేటాయించవచ్చు. అయితే ఆ మధ్య కేంద్రం అరకోర నిధులు విడుదల చేసినప్పటికీ ఎలాగూ జాతీయ హోదా ఉందిగా అన్న ధైర్యంతో పనులు కొనసాగిస్తూ వస్తుంది ఏపీ ప్రభుత్వం. తాజాగా కేంద్రమంత్రి ఉమాభారతి ప్రకటనతో వారి నెత్తిన పెద్ద బాంబు పడినట్లయ్యింది.
పోలవరం ప్రాజెక్టుపై ఒడిశా ప్రభుత్వం అభ్యంతరం లేవనెత్తుతుందని, ఈ నేపథ్యంలో ఆ అంశాన్ని ఏపీ పరిగణనలోకి తీసుకోవాలని ఢిల్లీలో ఆమె మీడియాతో అన్నారు. దీనిపై ఒడిశా తో మాట్లాడేందుకు తాను మధ్యవర్తిత్వం వహిస్తానని ఆమె చెప్పారు. పోలవరం గిరిజనుల జీవితాలతో ముడిపడిన సున్నితమైన సమస్యని, ప్రాజెక్టు నిర్మాణం చేపట్టక ముందే సమస్యలు సరిదిద్దుకోవాలని ఉమాభారతి కోరారు. ఏపీ, ఒడిశాకు కేంద్ర సహకారం తప్పకుండా ఉంటుందని భరోసా ఇచ్చారు. కానీ ఏపీ, ఒడిశా సీఎంలు మాట్లాడుకుంటేనే బాగుంటుందని ఆమె సూచించారు. గతంలో ఎట్టిపరిస్థితుల్లో ఐదేళ్లలో పోలవరంను పూర్తి చేసి తీరతామని ఉమానే ప్రకటించింది. ఇక ఇప్పుడు ఇలా మాట మార్చడం వెనుక మతలబు ఏంటో అర్థం కావటం లేదు. అయినా జాతీయ హోదా ప్రకటించిన ఓ ప్రాజెక్టుకు ఇంకా మాటలు ఏంటనీ, త్వరగతిన పూర్తి చేయాల్సిన టైంలో ఇలా లేనిపోనీ మెలికలు పెట్టడం ఏంటని రాజకీయ వర్గాల్లో ఇప్పుడు తీవ్ర చర్చ నడుస్తుంది. మరి దీనికి ఏపీ సీఎం చంద్రబాబు ఎలా స్పందిస్తారో చూడాలి.