తెలంగాణ టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవితకు కేంద్ర మంత్రి ఒకరు పెద్ద పంచే ఇచ్చారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిలకు పరపతి ఉంటే 20 వేల కోట్ల రూపాయల నిధులు కేంద్రం నుంచి తీసుకురావాలని, అలా తీసుకువస్తే తానే బీజేపీకే ఓటేస్తానని టీఆర్ఎస్ ఎంపీ కవిత పేర్కొనడం తెలిసిందే. దీనిపై సీనియర్ నేత, కేంద్ర మంత్రి హన్సరాజ్ గంగారాం ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాదులో ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ... అసలు హైదరాబాదు నుంచి వస్తున్న ఆదాయాన్ని ఏం చేస్తున్నారని నిలదీశారు. బీజేపీ నేతలు కేంద్రం నుంచి నిధులు తీసుకువస్తే...మీరు కమిషన్లు తీసుకుని వెనకేసుకుంటారా? అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అన్నీ కేంద్రమే చేస్తే, ఇక రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని ఆయన అడిగారు. మీరు డబ్బులు తీసుకురండి అని అడగడం మాని, సమర్థవంతమైన పరిపాలన సాగించాలని ఆయన హితవు పలికారు. ఇన్నాళ్లు ఏ పార్టీ నేత నుంచి కూడా తగలని ఝలక్ కవితకు కేంద్ర మంత్రి నుంచే పడటం విశేషం.