గ్రేటర్ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయానికి బాధ్యతగా టీపీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేయబోతున్నట్టు మీడియాలో వస్తున్న ప్రచారంపై ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. రాజీనామా చేస్తానన్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని ఉత్తమ్ ఖండించారు. మెదక్ జిల్లా నారాయణఖేడ్ లో ఆయన మాట్లాడుతూ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అధికార పక్షం ఘోర మోసానికి పాల్పడిందని ఆరోపించారు. ఈవీఎంలలో జరిగిన అవకతవకలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. ఈవీఎంలకు సంబంధించిన ప్రింట్ వివరాలు అందించాలని కోరామన్నారు. ఈవీఎంలపై తమకు నమ్మకం లేదని, నారాయణఖేడ్ ఉప ఎన్నికలో బ్యాలెట్ పేపర్లను వినియోగించాలని ఉత్తమ్ కోరారు.
ఇక గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి దానం నాగేందర్ చేసిన రాజీనామాకు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆమోదం తెలిపింది. పార్టీ అధిష్ఠానం సూచన మేరకు రాజీనామాను ఆమోదించినట్టు తెలిసింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ దానం రెండు రోజుల కిందట రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఆయన తన రాజీనామా లేఖను పంపించారు.