ప్రజాస్వామ్య బద్ధంగా ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలే ఎన్నుకోబడిన ప్రభుత్వాలు పాలిస్తున్నారు. మరి అలాంటప్పుడు వారికి అంతలా భద్రత ఎందుకు? ఇది ప్రతీ ఒక్కరినీ కదిలించే ప్రశ్నే. హడావుడిగా ఆఫీస్ కి బయలుదేరిన వారు, తిరిగి అదే ఆఫీసు నుంచి ఇళ్లలకు బయలుదేరిన వారికి హైదరాబాద్ లో ట్రాఫిక్ కష్టాలు బోనస్ అంటే... మళ్లీ నేతల రాకసందర్భంగా విధించే ఆంక్షలు మరీనూ. గల్లీ నేతల, చోటా నేతల దగ్గరి నుంచి ఢిల్లీ లీడర్ల దాకా గన్ మెన్లు సెక్యూరిటీ అంటూ హడావుడి, ఇదేమంటే బడిత పూజ తప్పదు. ప్రస్తుతం తెలంగాణలోనూ ఇదే సీన్ జరుగుతుంది.
దీనిపై విరుచుకుపడ్డారు విరసం(విప్లవ రచయితల సంఘం) నేత వరవరరావు. తెలంగాణ ప్రభుత్వం కూడా తుపాకీ గొట్టాల రాజ్యం నడుపుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ టీవీ ఛానెల్ కు ఇంటర్వ్యూలో భాగంగా తుపాకీ గొట్టంతో రాజ్యాధికారం సాధ్యమా? అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ... ప్రస్తుత ప్రభుత్వాలు రాజ్యాధికారం సాగించేది తుపాకీ గొట్టంతోనేనని అన్నారు. ఎవరు అంగీకరించినా, అంగీకరించకున్నా ఇది వాస్తవమని ఆయన తేల్చారు. తెలంగాణలో అఖిలపక్షం నిర్వహించిన బంద్ ను కూడా ప్రభుత్వం తుపాకీ గొట్టంతోనే అణచివేసిందని అన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు గొంతెత్తిన ప్రతిసారీ ఇదే సమాధానం దొరుకుతుందని ఆయన తెలిపారు.
తుపాకీ గొట్టం లేకపోతే ప్రభుత్వాలు ఒక్క క్షణం కూడా పనిచేయలేవని ఆయన అన్నారు. భద్రత స్టేటస్ సింబలా? అని ఆయన ప్రశ్నించారు. ప్రజా సేవ చేస్తామనే వారికి స్టేటస్ సింబల్ ఎందుకు? అని ఆయన నిలదీశారు. ఇక ఇలాంటి ప్రభుత్వాలు ప్రజల పక్షాన పోరాడే వారిని మావోయిస్టులు, అరాచకవాదులు అని ముద్ర వేసి, ఎంతకైనా తెగిస్తున్నాయని ఆయన మండిపడ్డారు. అసలు ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకులకు రక్షణ ఎందుకు? అని ఆయన ప్రశ్నించారు. వరంగల్ ఎన్ కౌంటర్ తోపాటు ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న కూబింగ్ ల నేపథ్యంలో వరవరరావు వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రజా సంఘాల తరపున కాకుండా ప్రజల తరపునే అన్నట్లుగా భావించాల్సి ఉంటుంది.