విదేశాల్లో నగదు దాచుకున్న వారి పేర్లను బహిర్గతం చేస్తున్న 'పనామా పేపర్స్' పేరిట విడుదల చేస్తున్న జాబితాలో భారతీయ సెలబ్రిటీల్లో కలకలం రేపుతుంది. ఇప్పటిదాకా రెండు జాబితాలుగా పేర్లను విడుదల చేసిన జర్మనీ పత్రిక 'సుడియుషె జీతంగ్' ఈరోజు మరికొందరి వివరాలను వెలువరించింది. అయితే ఇదే అదనుగా చేసుకుని కొన్ని రాజకీయ పార్టీలు తమ తమ ప్రత్యర్థులపై పడుతున్నాయి. అందులో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి పేరు కూడా త్వరలో వస్తుందని వైకాపా జోస్యం చెబుతోంది.
ఆ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ... బాబు విదేశాల్లో ఆస్తులను దాచాడన్నది అందరికీ తెలిసిన సత్యమని అన్నారు. నల్లధనం దాచుకున్న వారిపై కేంద్రం విచారణ జరిపితే, ఆయన పేరూ కూడా తప్పకుండా బయటకు వస్తుందని ఆమె తెలిపారు. అమరావతి నిర్మాణం పేరుతో జరుగుతున్న అవినీతి బాగోతం బట్టబయలు కావాల్సిన అవసరం ఉందని అన్నారు. గతంలోనే చంద్రబాబు అవినీతిని తెహల్కా బయట పెట్టిందని గుర్తు చేసిన ఆమె, ఆయన పాపాలు త్వరలోనే బయటకు వస్తాయని ఆమె పేర్కొన్నారు. అదన్న మాట అసలు సంగతి!