ఒక తెలుగువాడిగా పైగా కేంద్ర కేబినెట్ లో కీలకపాత్ర పోషిస్తూ దేశ రాజకీయాలను శాసిస్తున్న వెంకయ్య నాయుడు ఏపీ కోసం ఏనాడూ మాట్లాడిన పాపాన పోలేదు. విభజనకు ముందు ఒకలా, తర్వాత ఒకలా మాట్లాడిన నేతల్లో ఆయన ఒకరు. పన్ను మినహాయింపు ఐదేళ్లు అంటే కాదు కాదు పదేళ్లంటూ మాటల భక్తిని ప్రదర్శించారు ఆయన. చివరికి రాష్ట్రం వేరయ్యాక ప్యాకేజీ దగ్గరి నుంచి ప్రత్యేక హోదా దాకా ఆంధ్రప్రదేశ్ కి చెందిన ఏ ఒక్క అంశంపై క్లారిటీ ఇవ్వలేదు. ఏం అంటే అసలు ప్రత్యక్ష ఎన్నికల్లో ఇకపై పోటీ చేయబోనంటూ సంబంధం లేని పలుకులు పలికారు. దాటవేత ధోరణిని బాగా ప్రదర్శించారు కూడా. మరి అలాంటాయన చివరికి గళం విప్పాడు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాల్సిందేనని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు శుక్రవారం పార్లమెంట్ లో వెల్లడించారు. ఏపీకి రెవెన్యూ లోటు ఉన్నందునే హోదా కావాలని ప్రజలు కోరుతున్నారని, అలా కోరుతున్నవారిలో తాను కూడా ఉన్నానని స్పష్టం చేశారు. హోదా వస్తేనే రాష్ట్ర అభివృద్ధి త్వరితగతిన సాగుతుందని ప్రజలు నమ్ముతున్నారని తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశం నీతి ఆయోగ్ పరిశీలనలో ఉందని వెల్లడించిన ఆయన, ఏపీ అభివృద్ధికి, విభజన హామీల అమలుకు కేంద్రం కృతనిశ్చయంతో ఉందని పేర్కొన్నారు.
అయితే అభివృద్ధి చెందిన పంజాబ్ వంటి రాష్ట్రాలు కూడా ప్రత్యేక హోదాను అడుగుతున్నాయని గుర్తు చేసిన ఆయన, మరెన్నో రాష్ట్రాలు అదే డిమాండ్ ను తెరపైకి తెస్తున్నాయని తెలిపారు. ఈ విషయంలో పట్టుదలకు పోకుండా, దేశ సమగ్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించటం గమనార్హం. చివర్లో తేల్చకపోయినా ఇన్నాళ్లకు ఆయన మనసులో బయటికి రావటం చెప్పుకోదగిందే కదా.