ఎదుటివారి మీద నవ్వుతూ సెటైర్లు వేస్తునే నొప్పింపక తానోవక్క అన్న చందాన వ్యవహారిస్తుంటారు బీజేపీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు. మాటకారి మాంత్రికుడిగా(మంత్రిగా) ఆయన పలు సందర్భాలలో మనకు తారసపడిన సందర్భాలు కూడా ఎన్నో. అయితే ఈ క్రమంలో ఆయన ఎప్పుడూ వివాదాల జోలికి పోలేదు. కానీ, మొదటిసారి వివాదాస్పద వ్యాఖ్యలకు దిగారు. అయితే అది వ్యక్తులను ఉద్దేశించి కాదు. దేశం మొత్తం ఆసక్తిగా గమనించే అయోధ్య రామమందిర విషయంలో. పార్లమెంటు శీతాకాల సమావేశాలు ముగిసిన సందర్భంగా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి హోదాలో బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన రామ మందిర నిర్మాణాన్ని ప్రస్తావించారు.
అయోధ్యలో రామ మందిరం నిర్మాణాన్ని ప్రతి భారతీయుడు కోరుకుంటున్నాడని, అది ప్రభుత్వం నెరవేర్చే సమయం ఎంతో దూరం లేదని ఆయన అన్నారు. అప్పటికి కాస్త ముందుగా, వీహెచ్ పీ వ్యాఖ్యలు, రామ మందిరం నిర్మాణం కోసం ఇటుకలు తరలిస్తున్న వైనంపై రాజ్యసభలో విపక్షాలు ఒంటికాలిపై లేచాయి. సభ కార్యకలాపాలను అడ్డుకున్నాయి. రాజస్థాన్, గుజరాత్ తదితర రాష్ట్రాల నుంచి ఇటుకల లోడ్ వచ్చిందని, ప్రభుత్వంకి తెలియకుండానే ఇదంతా జరుగుతుందా అని రచ్చ చేశాయి. దీంతో సభ కొద్దిసేపు వాయిదా కూడా పడింది. ఆపై సమావేశాలు నిరవధికంగా వాయిదా పడిన వెంటనే రామ మందిరం నిర్మాణంపై వెంకయ్య కీలక వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఒకవేళ సభలో గనక ఆయన ఈ వ్యాఖ్యలు చేసి ఉంటే పరిస్థితి ఎలా ఉండేది. సీన్ సితార అయ్యేదేమో.