ఎర్రబెల్లి వ్యవహారం, విలీనం వెనుక అసలు కథ

February 11, 2016 | 10:49 AM | 2 Views
ప్రింట్ కామెంట్
Errabelli-Dayakar-Rao-and-Prakash-Goud-to-join-TRS-niharonline.jpg

గప్ చుప్ గా సహచర ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ తో కలిసి ఎర్రబెల్లి టీఆర్ఎస్ లో చేరడం అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. టీడీపీ శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి అకస్మాత్తుగా టీఆర్ఎస్ లో చేరడంపై అంతా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై రాజకీయ విశ్లేషణలు మొదలయ్యాయి. ఇది ఖచ్ఛితంగా అకస్మాత్తుగా జరిగినది కాదని, వెనుక పెద్ద స్క్రీన్ ప్లే ఉండి ఉంటుందని అంతా అనుమానిస్తున్నారు.

నిన్న మొన్నటి వరకు తలలు తెగిపడ్డా 'టీడీపీయే సర్వస్వం' అని చెప్పిన నేతలు ఇలా అకస్మాత్తుగా ప్లేట్ ఫిరాయించటంలో ఎవరు కీలక పాత్ర పోషించారు? అనేది ఆసక్తికరంగా మారింది. ఇక్కడ తాను పార్టీ మారిన సందర్భంగా టీఆర్ఎస్ లోని కీలకమైన నేతల పేర్లను ఎర్రబెల్లి ఉటంకించారు. కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, తుమ్మల, నాయినిలు తమకు సహకరిస్తామని అన్నారని అన్నారు. ఈ లెక్కన ఎర్రబెల్లి చేరిక వెనుక భారీ మంత్రాంగమే నడిచినట్టు అనిపిస్తోంది. తెలంగాణలో టీడీపీని బొందపెట్టేందుకు తెరవెనుక చాలా తతంగమే నడిచిందని అర్థమవుతోంది.

                           లేకపోతే అకస్మాత్తుగా వీరు పార్టీ మారడమేంటి? బడ్జెట్ సమావేశాలకు సిధ్ధమవుతున్న వేళ టీడీపీ విలీనం గురించి వ్యాఖ్యానించడమేంటి? అని ఆయన సందేహం వ్యక్తం చేశారు. ఇక్కడ అసలు గోతిని తవ్వింది మాత్రం తుమ్మల నాగేశ్వరరావు అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. గ్రేటర్ ఎన్నికల్లో వ్యూహాత్మకంగా టీఆర్ఎస్ అభ్యర్థులను నిలబెట్టడం దగ్గర్నుంచి, తాజాగా ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకునేంతవరకు ఆయన పాత్రను కొట్టేయలేమని ఆయన పేర్కొన్నారు.

ఏది ఏమైనా, టీఆర్ఎస్ లో టీడీపీ నేతల చేరికను ఆ పార్టీ కూడా నేరుగా విమర్శించే అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ టీడీపీలో ఇతర పార్టీలకు చెందిన నేతలను చేర్చుకోవడం, ఆ పార్టీ నైతికతను ప్రశ్నార్థకం చేసింది. దీంతో తెలంగాణలో టీడీపీ పరిస్థితి ఏంటనేది ఇప్పటికిప్పుడు తేలే వ్యవహారంలా కనిపించడం లేదు. అయితే వీరి చేరిక ఆ పార్టీని పెను ప్రమాదం అంచున నిలబెట్టింది. తెలంగాణలో ఆ పార్టీ వ్యూహం మార్చుకోవాల్సిన ఆవశ్యకతను చాటి చెబుతోంది. తాజా పరిణామాలతో వారిపై కేవలం వేటుతోనే సరిపెడుతుందా? లేక న్యాయ నిపుణులతో చర్చించి చర్యలేమైనా తీసుకుంటుందా చూడాలి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ