అనూహ్యంగా దీక్ష విరమణ ప్రకటించడంపై ముద్రగడ తీరుపై కొంతమంది విమర్శలు గుప్పించగా వాటిపై ఆయన స్పందించారు. కాపులకు రిజర్వేషన్లు సాధించే ప్రక్రియలో తన ఉద్యమం 20 శాతం మాత్రమే విజయవంతం అయిందని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అన్నారు. మిగతాది ప్రభుత్వమే చేయాల్సి ఉందని చెప్పారు. కాబట్టి ప్రభుత్వం మరోసారి రోడ్డెక్కే పరిస్థితి తీసుకురావద్దని తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో మీడియాతో అన్నారు.
ఏడు నెలల్లోగా జీవో ఇచ్చి కాపులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 25లోగా రుణాల కోసం కాపులు దరఖాస్తున్న చేసుకోవాలని ముద్రగడ కోరారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, కిర్లంపూడిలో ఆత్మహత్యా ప్రయత్నం చేసిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించిన అడిషనల్ ఎస్పీ దామోదర్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తుని ఘటనలో అమాయకులపై కేసులు పెడితే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. నిజాయితీగా తాను చేస్తున్న ఉద్యమంపై విమర్శలు రావటం భాదిస్తోందని ఆయన అన్నారు. విమర్శలు చేసే వారు కాపులకు ఇంతవరకు చేసిందేం లేదని ఆయన ఆక్షేపించారు. ప్రభుత్వం తరపు నుంచి ఏదైనా వ్యతిరేకత కనిపించినట్లయితే తిరిగి దీక్ష చేపడతానని, అయితే ఈసారి తీవ్రత ఎక్కువగా ఉంటుందని ఆయన హెచ్చరించారు.