ఓరుగల్లు ఉపఎన్నికలో ప్రచారం తారస్థాయికి చేరుకునే దశ ఆసన్నమైంది. ఇప్పటికే అధికార పక్షం తరపు నుంచి కీలక నేతలు హరీష్ రావు, కేటీఆర్ లు రంగంలోకి దిగి ప్రచారంలోకి దూసుకుపోతున్నారు. ఇక కాంగ్రెస్ తరపున టీ నేతలంతా వరంగల్ లో అడ్డా వేసేశారు. ఆఖరికి వైఎస్సార్పీపీ కూడా తమ తరపున ప్రచారం గురించి షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 16 నుంచి 19 వరకు జగన్ అక్కడ ప్రచారం నిర్వహించనున్నాడు. మరి టీడీపీ-బీజేపీ సంగతేమిటి? ఓవైపు అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకుపోతుంటే అవి మాత్రం మాత్రం కిక్కురుమనకుండా ఉండిపోవటం వెనక మతలబు ఏంటి.
అయితే తమ ఉమ్మడి అభ్యర్థి విజయం కోసం బీజేపీ, టీడీపీలు భారీగా శ్రమిస్తున్నాయి. ఈ క్రమంలో టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్.రమణ పెదవి విప్పారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ సేవలను ఉపయోగించుకుని ఉప ఎన్నికలో విజయం సాధిస్తామని ఆయన చెబుతున్నారు. ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థికి పూర్తి సహకారం అందిస్తున్నామనే విషయాన్ని తమ అధినేత చంద్రబాబుకు తెలియజేశామని రమణ అన్నారు.
మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వైఫల్యాలే తమ ప్రచార అస్త్రాలని ఆయా పార్టీలు చెబుతున్నాయి. అయితే భవిష్యతో రాజకీయాల గురించి నిన్న దాదాపు ఓ క్లారిటీ ఇచ్చినంత పని చేశాడు పవన్. 2019 ఎన్నికల వరకు పార్టీని బలపరుస్తానని చెప్పిన పవన్ ఎన్డీయేకు మద్ధతు కొనసాగుతుందని పరోక్షంగా చెప్పాడు. అయితే వరంగల్ ఎన్నికల ప్రచారం చేసే విషయంపై పవన్ కల్యాణ్ ఇంతవరకు వ్యక్తిగతంగా ఎక్కడా స్పందించలేదు. అప్పటిదాకా అది సస్పెన్స్ కూడా.