యాకుబ్ మెమన్ కు ఉరి అమలు

July 30, 2015 | 11:07 AM | 4 Views
ప్రింట్ కామెంట్
yakub_memon_hanged_at_nagpur_jail_niharonline

నాటకీయ పరిణామాల మధ్య  ముంబై పేలుళ్ల నిందితుడు యాకుబ్ మెమన్ ఉరి ప్రక్రియ సజావుగా ముగిసింది. 1993 ముంబై పేలుళ్ల 350 మందిని పోట్టనబెట్టుకున్న ఈ కిరాతకుడిను దాదాపు 23 ఏళ్లపాటు జైళ్లో ఉంచి మరీ మరణశిక్షను అమలు చేశారు. నాగపూర్ జైళ్లో ఉదయం 6.50 గంటలకు ఉరి అమలు జరిపినట్టు జైలు అధికారులు ప్రకటించారు. కనివిని ఎరుగని రీతిలో దేశ చరిత్రలోనే తొలిసారిగా అత్యున్నత న్యాయస్థానంలో అర్ధరాత్రి దాటాక విచారణ చేపట్టింది. మెమన్‌ ఉరి శిక్షను నిలిపి వేయాలంటూ అర్థరాత్రి దాటాక వేసిన పిటిషన్‌పై చీఫ్‌ జస్టిస్‌ హెచ్‌ఎల్‌ దత్తు స్పందించారు. అప్పటికప్పుడు జస్టిస్‌ దీపక్‌ మిశ్రా, జస్టిస్‌ ప్రఫుల్‌ చంద్రపంత్‌, అమితవ రాయ్‌లతో కూడిన ధర్మాసనం ఏర్పాటు చేశారు. ఇక ఈ ధర్మాసనం అసాధారణ రీతిలో అర్థరాత్రి 3 గంటలకు విచారణ చేపట్టింది. దీంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. క్షమాబిక్ష పిటిషన్ ను తిరస్కరించిన 15 రోజుల వరకు ఉరిని అమలు చేయటం నిబంధనలకు విరుద్ధమని, మహారాష్ట్ర జైలు యాక్ట్ కూడా కనీసం వారం వ్యవధి ఉండాలని చెప్పిందన్న విషయాన్ని మెమన్ తరపు న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ వినిపించారు. డిఫెన్స్ వాదనలను ఏజీ ముకుల్ రోహత్గీ తీవ్రస్థయిలో తిప్పికొట్టారు. పదేపదే పిటిషన్లు వేస్తోందంటూ డిపెన్స్ తీరును ఓ గేమ్ గా అభివర్ణించారు. ఏజీ వాదనలను సమర్థించిన బెంచ్ ఉరిని ఖరారు చేస్తూ తీర్పు వెలువరించింది. అంతకు ముందు చిట్టచివరి సారిగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి పంపిన క్షమాబిక్ష పిటిషన్ కూడా తిరస్కరించబడింది.  దీంతో నిబంధనల ప్రకారం ఈ తెల్లవారుజామున యాకుబ్‌ను నిద్రలేపిన అధికారులు ఫార్మాలటీస్‌ను పూర్తి చేశారు. మరోవైపు మెమన్ ఉరి నేపథ్యంలో దేశ వ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఇక ముందు నుంచీ సిద్ధంగా ఉన్న నాగపూర్ కేంద్ర కారాగారం అధికారులు సుప్రీంకోర్టు తీర్పును సజావుగా అమలు చేశారు. అంతకుముందు బుధవారం రాత్రి తన అన్న, భార్య తదితరులను యాకుబ్ కలుసుకున్నారు. భారత కాల మాన ప్రకారం ఉదయం 6.30 గంటలకు యాకూబ్ మెమన్‌ను ఉరి తీశారు. ముంబై లోని మహిం అనే ప్రాంతంలో అతని అంత్యక్రియలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.  పోతే తిరిగి రాని ప్రాణం కోసం ‘చిట్టచివరి దాకా’ ప్రయత్నం! ఉరికి... ఊపిరికి మధ్య గంటల తేడాతో వేలాడిన ప్రాణం! చివరి నిమిషం దాకా చేసిన పోరాటం ఫలించలేదు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ