వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తన బాణాన్ని రాజ్యసభకు ఎక్కుపెట్టినట్లు సమాచారం అందుతోంది. అదేనండీ ఆయన తన సోదరి షర్మిలను రాజ్యసభకు పంపించాలని భావిస్తున్నట్లు కథనాలు వినిపిస్తున్నాయి. అయితే, ఈ వార్తల్లో ఎంత మేర వాస్తవం ఉందన్నది తెలియాల్సి ఉంది. అక్రమాస్తుల కేసులో జగన్ జైల్లో ఉన్నప్పుడు, పార్టీని జనాల్లోకి తీసుకెళ్లడంలో షర్మిల విజయవంతం అయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆమె చేపట్టిన పాదయాత్రకు ఊహించని స్పందన వచ్చింది. ముఖ్యంగా అక్రమాస్తుల కేసులో జగన్ జైల్లో ఉన్నప్పుడు ఆమె పార్టీ బాధ్యతను భుజస్పందాలపై వేసుకుని నడిపించింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆ సమయంలో ఆమె పార్టీకి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు. అయితే సార్వత్రిక ఎన్నికల తర్వాత తెలంగాణ ఆవిర్భావం నుంచి ఆమె క్రియాశీలక రాజకీయాల్లోకి రాలేదు. ఈ క్రమంలో ఆమెను రాజ్యసభకు పంపటం ద్వారా ఆమెను తిరిగి తెరపై తెచ్చేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారట. తద్వారా తెలంగాణ రాష్ట్రంలో పార్టీ పున ప్రతిష్ట దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఆమెను ఎంపిక చేస్తే మిగతా నేతల మధ్య ఎలాంటి అసమ్మతి చెలరేగదని జగన్ భావిస్తున్నారట.